హోమో సేపియన్స్ గురించి వివరణ తెలుగులో
హోమో సేపియన్స్ అనేది హోమినిడే కుటుంబానికి చెందిన అత్యంత తెలివైన, పెద్ద మెదడు కలిగిన ప్రైమేట్ల జాతి.
02 ఫిబ్రవరి, 2024
ఈ భూమి ఎన్నో విభిన్నమైన, విశిష్టమైన జీవజాతులకు నెలవు. ఎన్నో కోట్ల జాతులలో మనుషులమైన మనమూ ఒక జీవజాతిగా పరిగణించబడతాము. మానవ జాతికి ఉన్న శాస్త్రీయనామమే హోమో సేపియన్స్. హోమినిడే కుటుంబంలో భాగమైన హోమో ఉపకుటుంబం నుండి పరిణామం చెందిన హోమో సేపియన్స్, అత్యంత తెలివైన ప్రైమేట్ల జాతి.
- హోమో సేపియన్స్ పరిణామం 200,000-300,000 సంవత్సరాల క్రితం నేటి ఆఫ్రికా ఖండంలో చోటుచేసుకుంది. అక్కడి నుండి భూమి నలుదిక్కులా జరిగిన వేలాది వలసల కారణంగా నేడు మనుషులు అన్ని చోట్లల్లో వెలసివున్నారు.
- హోమో జాతికి చెందిన ఉపజాతుల్లో నేటికి బ్రతికున్న జాతి మన హోమో సేపియన్స్ మాత్రమే. అదే హోమో జాతి నుండి పరిణామం చెందిన హోమో ఎరక్టస్, హోమో నియాండర్తల్స్ వంటి ఇతర మానవ జాతులు ఎప్పుడో అంతరించిపోయాయి.
- తమ రెండు కాళ్లపై నిటారుగా నిలబడి నడిచే గుణం కలిగినందున హోమో సేపియన్స్ బైపెడల్ కోవకి చెందుతారు.
- శరీర పరిమాణాన్ని బట్టి పోల్చితే, అన్ని జీవజాతుల్లోకి హోమో సేపియన్స్ మెదడు అతి పెద్దది (సగటు మానవ మెదడు బరువు: 1,300-1,400 గ్రాములు).
- సంక్లిష్టమైన భాష, ఆలోచన,సంస్కృతిని కలిగి ఉండడం హోమో సేపియన్స్ ప్రత్యేకత.
- హోమో సేపియన్స్ సర్వభక్షకులు, అంటే అటు శాకాహారం, ఇటు మాంసాహారం వంటి వేర్వేరు రకాల ఆహారాలను తింటారు.
- గుంపులుగా నివసించే జంతువులను “సామాజిక జంతువులు” అని అంటారు. సింహాలు, ఏనుగులు, తోడేళ్ళు వంటి జంతువులతో పాటుగా మన హోమో సేపియన్స్ కూడా సామాజిక జంతువులే.
- హోమో సేపియన్స్ జీవిత కాలం సుమారు 80 ఏళ్ళు, అయితే కొందరు వ్యక్తులు ఎక్కువ కాలం జీవించగలరు. ఈ సంఖ్య నేటి ఆధునిక కాలపు మనుషుల్ని ఉద్దేశించింది మాత్రమే. ప్రాచీన హోమో సేపియన్స్ జీవిత కాలం కేవలం 30-40 ఏళ్ళు మాత్రమే ఉండేదని అంచనా.
- సంతాన ఉత్పత్తి కోసం భాగస్వామితో జతకట్టే హోమో సేపియన్స్, లైంగికంగా పునరుత్పత్తి చేసే జీవుల కోవకి చెందుతారు.
- గుడ్డు పెట్టి పొదిగించే పక్షులు, పాములు వంటి జీవులకు భిన్నంగా గర్భం దాల్చి పునరుత్పత్తి చేసి, రొమ్ము పాలతో తొలిపోషణ కల్పించే జీవుల్ని క్షీరదాలు అంటారు. మన హోమో సేపియన్స్ కూడా క్షీరదాలే.
- హోమో సేపియన్స్ సాధనాలను ఉపయోగించగలరు. అంతరిక్ష ప్రయాణాన్ని సాధించిన ఏకైక జాతి హోమో సేపియన్సే!
- నేటికి సుమారు 8 బిలియన్ల మంది మనుషులు ఈ భూమిపై ఉన్నట్లు అంచనా.
- హోమో సేపియన్స్ భూమిపై అత్యధికంగా అధ్యయనం చేయబడిన జాతి.
- అన్ని జీవజాతుల కంటే అత్యంత తెలివైన జాతి హోమో సేపియన్స్ అన్నది తేటతెల్లం. వాస్తవానికి వేరే జీవజాతుల తెలివితేటల్నీ, ఐ.క్యూ సామర్థ్యాన్నీ అవి హోమో సేపియన్స్ సామర్థ్యాలకు ఎంత చేరువలో ఉన్నాయో అన్నదాని బట్టి నిర్ధారణ చేయడం జరుగుతుంది. అంటే తెలివితేటలకు హోమో సేపియన్స్ ఒక ప్రామాణికమైన సూచకం (reference) వంటివారు అన్నమాట!
- భూమిపై హోమో సేపియన్స్ ఆధిపత్య జాతి, గత కొన్ని వేల సంవత్సరాలలో మన గ్రహం మీద సంభవించిన మార్పులలో ఎక్కువ భాగం వాటికి బాధ్యత మనదే.
అతి క్లిష్టమైన, ప్రత్యేకమైన భావనలు, ఆలోచనలు, నడివడిక, సంస్కృతులు, నాగరికతల చేత హోమో సేపియన్స్ భూమిపై ఒక ఉన్నతమైన జీవజాతిగా వెలిశారు. సుదీర్ఘమైన, మనోహరమైన చరిత్ర కలిగిన సంక్లిష్ట జాతి, మన హోమో సేపియన్స్.
(గమనిక: తెలుగులో జంతువులకూ, మనుషులు కాని జీవజాతులకూ బహువచనంలో -యి ప్రత్యయం వాడినప్పటికీ, ఈ వ్యాసంలో హోమో సేపియన్స్-ను ఉద్దేశించినప్పుడు మానవ బహువచనం -రు వాడడమైనది.)